Monday, December 13, 2010

Tollywood Bandh Continues - మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు ?

టాలీవుడ్‌ కార్మికులకు, నిర్మాతల మండలికి మధ్య పెరిగిన అగాధం పరిశ్రమలో స్తబ్దతకు దారితీసింది. ఆంధ్రఫైటర్లకు, చెన్నై ఫైటర్లకు మధ్య మొదలైన గొడవ 'కందిరీగ'లా వెంటాడుతోంది. సమస్య తీవ్రతరమవటంతో షూటింగ్స్‌ ఆగిపోయాయి. మరోవైపు తామూ షూటింగ్స్‌ ఆపేస్తున్నామని నిర్మాతలు గందరగోళ పరిస్థితి సృష్టిస్తున్నారు.దీంతో సమస్య పక్కదారిపడుతోంది. కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళిఅక్కడే అన్న చందంగా మారాయి.

గత రెండు రోజులుగా ఫిలింఛాంబర్‌లో నిర్మాతలమండలి సమావేశం జరుపుతోంది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నిర్మాణ వ్యయాన్ని అదుపులో పెట్టాలనేదానిపై ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. అయితే కార్మికుల సమ్మె వల్ల పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు ఆగిపోయినా, సినిమా వార్తలు పత్రికల్లో రావటం పట్ల కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోస్ట్‌ప్రొడక్షన్స్‌ పనులే జరగనప్పుడు సినిమా ప్రొగ్రెస్‌ వార్తలు ఎందుకు రాస్తున్నారని సోమవారంనాడు ఓ నిర్మాత మీడియాను ప్రశ్నించారు. షెడ్యూల్‌ ప్రకారమే సినిమాలు విడుదలవుతాయని అక్కినేని నాగార్జున ఇటీవలే వెల్లడించారు. ఆయన నటించిన 'రగడ' 23న, వెంకటేష్‌ నటించిన 'నాగవల్లి' 16న రిలీజ్‌ కాబోతున్నాయి.

సమ్మె ఎందుకు చేస్తున్నారు !
తెలుగు ఫైటర్లకు అవకాశం ఇవ్వకుండా, చెన్నై ఫైటర్లకే అగ్రతాంబూలం దక్కడం సమస్యకు దారితీసింది. తెలుగు పరిశ్రమలో అంతా అరవంవాళ్లే ఎక్కువ ఉంటున్నారని, పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావాలని నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అన్నారు. అంతేగాక పరిశ్రమ ఇక్కడ ఏర్పడటానికి వివిధ ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇచ్చారు. దీనివెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం...అనేకమంది ఇక్కడి తెలుగువారికి ఉపాధి కలిగించాలన్నదే. ప్రభుత్వ సహాయ, సహకారాలతో నిలదొక్కుకున్నవారు నిర్మాతలు, హీరోలు. మరి అలాంటివారే టెక్నీషియన్లను, ఫైటర్లను చెన్నై నుంచో, బాంబే నుంచో తీసుకొస్తే ఇక్కడున్నవారి పరిస్థితి ఏంటన్నది కార్మికుల ప్రధాన ప్రశ్న. 1995 నుంచీ పలు సందర్భాల్లో కార్మికులు ఈ సమస్యపై మాట్లాడుతున్నారు.


అసలు 'కథానాయకులు' ఎవరు !
ఇక్కడి ఆంధ్రా ఫైటర్లకు సరైన నైపుణ్యం లేదన్నది ప్రధానంగా కొంతమంది నుంచి వినిపిస్తోన్న వాదన. ఇది అన్ని శాఖలకూ వర్తిస్తుందన్నది మరోవాదన ! తెలుగు హీరోలు ఈ విషయంలో నిర్మోహమాటంగా తెలియజేస్తున్నారు. తమ చిత్రాలకు చెన్నై ఫైట్‌మాస్టర్స్‌ బాగా పనిచేస్తారని, స్కిల్స్‌ విషయంలో వారే ముందున్నారని అంటున్నారు. 'అవకాశం ఇస్తేనే కదా...తెలిసేది. 20 సంవత్సరాలుగా ఇండిస్టీని నమ్ముకుని 15 వేల కుటుంబాలు హైదరాబాద్‌లో జీవిస్తున్నాయి. మొదటి క్రికెట్‌ వన్డేలో సచిన్‌ సున్నాకే అవుటయ్యాడు. మరో అవకాశం ఇచ్చి ఉండకపోతే, ఇంతపెద్ద ఆటగాడు అయ్యేవాడా ! అలాంటి నమ్మకంతోనే తమనూ ప్రోత్సహించాలి, అది కరువైంది' అని ఫైటర్స్‌ అంటున్నారు. తమకు అవకాశం ఇవ్వకుండా, దూరం పెట్టడం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళతామని వారు పేర్కొన్నారు.


సగం..సగం
సౌత్‌ ఇండియా సినీ ఫైటర్ల మధ్య 1996లో ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. టాలీవుడ్‌, చెన్నైకి సంబంధించి 50:50 నిష్పత్తిలో అంగీకారం కుదిరింది. దీనర్థం ఓ సినిమా యూనిట్‌ సభ్యుల్లో 50 శాతం తెలుగువారుండాలి. అయితే దీనికి చుక్కగుర్తు ఏర్పరచి, కండీషన్‌ అప్లై అంటున్నారు. లొసుగులను ఆసరాగా చేసుకుని అసలుకు ఎసరు తెస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో షూటింగ్స్‌ జరిపినపుడు, పై ఒప్పందం పాటించక్కర్లేదని, పరభాషా టెక్నీషయన్లను, కార్మికులను వినియోగిస్తున్నారు. దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. పరిశ్రమ పెద్ద మనుషలను సంప్రదిస్తే...ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ జరిగినా, పూర్వం అనుకున్న నిష్పత్తి అమలు చేయాలని ఒప్పందం చేశారు. అది 2008లో అగ్రిమెంటు అయింది. కానీ అమలు కావడం లేదని ప్రముఖ ఫైట్‌మాస్టర్‌ డ్రాగన్‌ ప్రకాష్‌ పేర్కొన్నారు.


దాసరి, రామానాయుడు హామీ
1995లోనే ఫైటర్లు సమ్మె బాటపట్డారు. దాని పర్యావసానంగా 75 రోజులు షూటింగ్‌లు ఆగిపోయాయి. కోటశ్రీనివాసరావు కలుగజేసుకుని కార్మికులకు అండగా నిలిచారు. దీనికి దాసరినారాయణరావు, రామానాయుడు వంటి వారు హామీ ఇచ్చి, చెన్నై నుంచి హైదరాబాద్‌ తరలివస్తే పని కల్పిస్తామని చెప్పారు. ఆ క్రమంలోనే ఫైట్‌మాస్టర్‌ రాజు, విక్కీతోపాటు 30మంది ఫైటర్లు వచ్చారు. వెంకటేష్‌, నాగార్జున తదితర ప్రముఖ హీరోల చిత్రాలకు ఫైటర్లతోపాటు, పలు శాఖలకు చెందిన కార్మికులు పనిచేశారు. ఆ చిత్రాలు 100 రోజులు కూడా ఆడాయి.


అవకాశాల్లేవ్‌...అన్యాయం జరుగుతోంది : ప్రముఖ ఫైటర్‌ ప్రకాష్‌
పోరాట సన్నివేశాలను బట్టి చెన్నైవారు 20 మంది వస్తే, మనవారికి మాత్రం ఐదుగురికే అవకాశం దక్కుతోంది. అశ్వనీదత్‌ నిర్మాతగా ఎన్టీఆర్‌ నటించిన 'శక్తి' షూటింగ్‌ బాదామిలో జరిగింది. చెన్నైకు చెందిన స్టంట్‌ శివ నేతృత్వంలో 20 మంది ఫైటర్లు పాల్గొన్నారు (ఐదుగురు కంపోజర్లు, ఐదుగురు అసిస్టెంట్లు అందులో ఉన్నారు). టాలీవుడ్‌కు చెందిన కేవలం ముగ్గుర్ని మాత్రమే తీసుకున్నారు. బెల్లంకొండ సురేష్‌ 'కందిరీగ' ఉత్తరాదిలో షూటింగ్‌ జరుపుకుంటోంది. అవకాశం కల్పించాలని అడిగాం. హైదరాబాద్‌ వచ్చాక పని కల్పిస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారు. నాలుగురోజులు షూటింగ్‌ చార్మినార్‌ వద్ద ఇటీవల జరిపారు. మొదట చెప్పినదానికి విరుద్ధంగా మాకు అవకాశాలు రాలేదు. అన్యాయం జరిగింది. ఈ విషయం తెలిసిన ఆంధ్రా ఫైటర్లు వారిని ప్రశ్నించారు. ఆ ప్రయత్నంలో మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది.


'రోబో'కు ఇదే తంతు
రజనీకాంత్‌ 'రోబో' సినిమాకు ఫైట్‌మాస్టర్‌ పీటర్‌హేయిన్స్‌ ఆధ్వర్యం వహించారు. 200 మంది అవసరం. అందులో మనవాళ్లను తీసుకుంటామని నిర్మాత ఆహ్వానించారు. మేం ప్రయాణానికి సంబంధించిన టికెట్స్‌ కూడా కొనుక్కున్నాం. అందరూ బ్యాగులు సర్దుకుని బయలుదేరుతున్న సమయంలో నిర్మాత నుంచి ఫోన్‌ వచ్చింది. హైదరాబాద్‌ ఫైటర్లతో తాను సినిమా చేయనని పీటర్‌ చెబుతున్నాడని, మీరు రావొద్దని ఆయన చెప్పారు. కొన్ని సమయాల్లో నిర్మాత కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మేమూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇది తప్పని తెలిసినా, నివారించలేకపోతున్నారు. యూనియన్‌ ద్వారా పోరాటం చేసినా, అన్యాయం జరుగుతూనే ఉంది.


కడుపు రగిలిపోతుంది
'తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల షూటింగ్స్‌ హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. యూనియన్‌ ఆఫీసుల ముందట్నే ఆయా షూటింగ్స్‌ నిర్వహిస్తున్నారు. అందులో పరభాషా టెక్నీషయన్లు, కార్మికులు ఎక్కువ కనబడుతున్నారు. నిర్మాత చుట్టూ తిరిగి అవకాశం దక్కించుకుంటే, తీరా షూటింగ్‌ వేళ చెన్నై వారే కావాలని మన హీరో పట్టుబడుతున్నాడు. దీంతో తానేం చేయలేనని నిర్మాత చేతులెత్తేస్తున్నాడు. అయోమయ పరిస్థితిలో చిక్కుకుపోవటం మావంతవుతోంది. తెలుగు ఇండిస్టీని నమ్ముకుని భార్యబిడ్డలతో తరలివచ్చాం. వేలాది రూపాయల సభ్యత్వం చెల్లించాం. కనీస ప్రాధాన్యత కూడా దక్కటం లేదు. కడుపు రగిలిపోతోంది' అని వివిధ శాఖల కార్మికులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.


అవకాశాలు ఇక్కడివి..పనిచేసేది అక్కడివారు
చెన్నై సభ్యత్వం ఉన్న ఓ ఫైట్‌మాస్టర్‌ రామ్‌-లక్ష్మణ్‌. పనిచేసేది తెలుగు సినిమాల్లో. అనేక చిత్రాల్లో ఆయన పేరును ఫైట్‌మాస్టర్‌గా ప్రకటిస్తున్నారు. తీరా షూటింగ్‌ స్పాట్‌లో చెన్నై ఫైటర్స్‌ కనబడుతున్నారు. ఇక్కడి ఫైట్‌ మాస్టర్ల పరిస్థితి ఏంటి ! అవకాశాలు మాత్రం ఇక్కడివి, పెద్దమొత్తాల్లో దండుకుంటుంది మాత్రం అక్కడివారు. హైదరాబాద్‌ ఫైటర్లను వినియోగించాల్సి వస్తే పైనుంచి దూకడాలు, ఛేజింగ్‌లు, గాజు పదార్థాలతో పోరాటాలు...ప్రమాదకరమైన పని చేయమంటున్నారు. పొరపాటున చేయలేకపోతే, ఆంధ్రా ఫైటర్లు సరిగ్గా చేయడం లేదని తప్పుడు సంకేతాలు వెలువరుస్తున్నారు.

Courtesy : Prajasakti

No comments:

Post a Comment