అంచనాలకు తగినట్లుగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెడ్లకే పెద్ద పీట లభించింది. అగ్రవర్ణాలకు మంత్రివర్గంలో ఎక్కువ మంత్రి పదవులు దక్కగా అందులోనూ రెడ్లే అత్యధిక మంత్రి పదవులు దక్కించుకున్నారు. 39 మంది మంత్రుల్లో 22 మంది అగ్రవర్ణాలవారే. వీరిలో ముఖ్యమంత్రితో కలుపుకుని రెడ్లు 14 మంది ఉన్నారు. మిగతా అగ్రకులాలకు కూడా తక్కువగానే మంత్రి పదవులు లభించాయి. తెలుగుదేశం కమ్మ కులానికి, కాంగ్రెసు రెడ్డి కులానికి ప్రాతినిధ్యం వహిస్తుందనే దళిత బహుజనుల విమర్శలను ధ్రువీకరిస్తే కమ్మ కులానికి చెందిన గల్లా అరుణకుమారికి మాత్రమే మంత్రి పదవి లభించింది. కాగా, ముగ్గురు కాపులకు మంత్రి పదవులు దక్కాయి. వెలమ కులానికి ఒక్క మంత్రి పదవి మాత్రమే దక్కింది. క్షత్రియ కులానికి ఒక్క మంత్రి పదవి దక్కింది. బ్రాహ్మణులకు, వైశ్యలకు ఒక్కటేసి మంత్రి పదవులు దక్కాయి. వైశ్య కులానికి చెందిన టిజి వెంకటేష్ మంత్రి పదవి దక్కించుకున్నారు.
పది మంది బిసీలకు మంత్రి పదవులు దక్కాయి. ఎస్సీలకు ఆరు మంత్రి పదవులు దక్కాయి. వీరిలో మాలలకు మూడు, మాదిగలకు మూడు మంత్రి పదవులు లభించాయి. మాదిగ, మాల ఉప కులాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఏర్పడింది. ఎస్టీలకు, మైనార్టీలకు ఒక్కటేసి మంత్రి పదవులు దక్కాయి. కొప్పుల వెలమకు ఒక్క మంత్రి పదవి దక్కింది. రజకుల నుంచి ఒక్కరిని మంత్రిగా తీసుకున్నారు. మున్నూరు కాపులకు రెండు, తూర్పు కాపులకు ఒక్కటి, శెట్టి బలిజలకు ఒక్క మంత్రి పదవులకు దక్కాయి. యాదవులకు రెండు మంత్రి పదవులు లభించాయి. మత్స్యకారుల నుంచి ఒక్కరికి మంత్రి పదవి లభించింది.
No comments:
Post a Comment